Monday 14 October 2019

ధరల పెరుగుదలే.....


ధరల పెరుగుదలే 
సామాన్యులకు కలిగిస్తోంది మనో వ్యధ
రెక్కలు ముక్కలు చేసుకున్నా
తిప్పలు తప్పటం లేదు మరి ఎలా ?
రోజురోజుకూ పెరుగుతున్న
స్కూల్ ఫీజుల భారం ఒకవైపు
ఎన్ని చదువులు చదివినా
ఉద్యోగం గ్యారంటీ లేదు ఈనాడు
జీవిత పర్యంతం కష్టపడి సంపాదించినా
చాలదే చాలదు అరకొర ధనం
మరి ఏం చేయాలి మనం
అనారోగ్యం పాలైతే చుక్కలు చూపిస్తున్నాయి 
వైద్య ఖర్చులు
ఇక చూడాల్సిందే దిక్కులు
నిత్యావసర ధరలు చూస్తుంటాయి ఆకాశం వైపు
సామాన్యులు బెంబేలెత్తి  చూస్తారు దేవుడు వైపు
ఎప్పుడు తగ్గుతాయి వెతలు
సామాన్యుల జీవితాలలో మార్పు ఎప్పుడు ?
ఆదాయం పెరిగేదెప్పుడు
పేద ధనిక భేదాలు సమసిపోయేదెప్పుడు?
                                              - తోట యోగేందర్

Saturday 12 October 2019

వాన నీరు సంరక్షించి...

కవిత
వాన నీరు సంరక్షించి
భూగర్భ జలాలు పెంచి
భవిష్యత్ తరాలకు నీటి వనరులు పంచాలి
డబ్బు పంచడమే చాలదు
ఆస్తుల పంపకమే  కాదు
సహజ వనరుల పరిరక్షణ కూడా కావాలి
వాతావరణ పరిరక్షణ కి  పూనుకోవాలి
కాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతిని ప్రేమించాలి
ప్రకృతితో సహజీవనం చేయాలి
ప్రాకృతిక సంపద పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి
సహజ వనరులకు విఘాతం కలగకుండా
సహజీవనం చేయటం తెలుసుకుని జీవించాలి
ప్రాకృతిక సంపద పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి
ప్రకృతిని ప్రేమించాలి
నేడు ప్రకృతితో మమేకమై జీవిస్తెనే 
రేపు భవిష్యత్తు తరాల జీవితం సుఖాంతమవుతుంది
                     - తోట యోగేందర్






Tuesday 1 October 2019

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ
బానిసత్వపు సంకెళ్ళను
తెంచిన మహా మనిషి మన గాంధీ
పరాయిపాలన అంతమొందించుటకు
అహింసా మార్గంలో నడయాడిన ధీశాలి
మొక్కబోని ఆత్మవిశ్వాసంతో
దేశ ప్రజలను స్వాతంత్ర సంగ్రామంలో నిలిపి
బ్రిటీషు మత్త గజాలను గడ గడలాడించిన వ్యక్తి
అంటరానితనం నేరమని
అందరూ కలిసుండడమే స్వర్గమని తెలియచెప్పిన మహాశక్తి
కానరాడు ఇలలోన ఇలాంటి నేత
గాంధీ మార్గంలో నడవాలి మనమంతా
ఏ ఆయుదమూ లేకుండా
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి
ప్రపంచానికి భారతీయుల శక్తిని చాటిన మహానేత మన బాపూజీ
గాంధీ మార్గం సదా ఆచరణీయం
ఆయన బాటలో నడిచి అవుదాం విజేతలం

                                    - తోట యోగేందర్

Thursday 19 September 2019

అడవి తల్లి

కవిత 
అడవి తల్లి
వన్యజీవుల పాలిట కల్పవల్లి
ఎన్నెన్నో రకాల వృక్షాలకు నెలవు
సహజ సిద్ద వాతావరణంతో అలరారు
పక్షుల కిలకిలారావాలతో
జీవవైవిద్యపు సొగసుతో
భౌగోళిక సౌందర్యాన్ని ఇనుమడింపచేయు
ప్రాకృతిక సంపదను పంచి
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి
సకల జీవజాతికి మేలుచేయు
వ్యాపార కాంక్షతో
యురేనియం తవ్వకాలతో
నల్లమలను నాశనం చేయొద్దు
                      - తోట యోగేందర్,
                               

Sunday 13 January 2019

మనసు కొలనులో


నూతన సంవత్సర శుభాకాంక్షలతో
కవిత
మనసు కొలనులో మమతల కలువలు విరబూయాలి
మనిషి మనిషిలో మానవత్వపు సుగంధం పరిమళించాలి
అంతరంగంలో ఆత్మీయ అనురాగాలు వెల్లివిరియాలి
మొత్తంగా మన జీవితాలలో
ఆనందపు కాంతులు నిండాలి
సంతోషకరమైన సమాజం
మన ముందు నిలవాలి
-తోట యోగేందర్,