Sunday 28 April 2013

పరిగెడుతున్నారు...!

పరిగెడుతున్నారు...!

విద్యార్ధులు ర్యాంకుల వెంట పరిగెడుతున్నారు
కళాశాలలు ర్యాంకుల పంట పండిస్తున్నారు
తల్లిదండ్రులు ర్యాంకుల కోసం
పిల్లల వెంట పడుతున్నారు
ర్యాంకులు రానిదే భవిష్యత్ లేదన్నట్లు
తమ పిల్లలు బ్రతకలేరన్నట్లు
తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు
పిల్లలు పుట్టిననాటి నుండే
ఏ కాన్వెంట్ లో చదివించాలి,
ఏ కోర్సులో చేర్పించాలి
ఏ కళాశాలను ఎంచుకోవాలి
అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు
పిల్లలు భవిష్యత్ పై ఆందోళన పడుతున్నారు
ఇక మూడేళ్ళ నుండే విలువలు నేర్పని
విద్యాసంస్ధలలో చేర్పించి
పోటీ ప్రపంచంలో విజయం పొందాలని
కళ్ళుతెరిచినప్పటి నుండి చీకటి పడేవరకు
చదివించి , వాళ్ళను యాంత్రికంగ మార్చి
చివరికి యంత్రాలుగా మారుస్తున్నారు
ఇక క్షణం తీరిక లేక డబ్బు సంపాదన యావలో
పడిన వాళ్ళని చూసి మానవత్వం లేదని ,
ఇతరులను గౌరవించే తత్వంలేదని ,
నైతిక విలువలు లేవని బాధపడుతున్నారు
ఇది విలువలు నేర్పని విద్యావ్యవస్థ లోపమో ,
ఆశల పల్లకిలో పరిగెడుతున్న తల్లిదండ్రుల లోపమో
కాలమే నిర్ణయించాలి....!

                                                         -  తోట యోగేందర్

Tuesday 16 April 2013

మార్పురావాలి .. !

మార్పురావాలి .. !

హోదా, ధనం చూసి
పలుకుబడి ఉన్న వారి వెంట పరిగెత్తే
ఓటరులో మార్పురావాలి
ఆకర్షణ మంత్రాలకు
అలవికాని వాగ్ధానాలకు
మోసపోని ఓటరుగా మారాలి
నిజాయితీతో పనిచేసే
అవినీతిని అసహ్యించుకునే
బందుమిత్ర ప్రీతి చూపక
వ్యక్తులందరిని సమంగ చూసే
నేతలవైపు చూడాలి
ఎవరో సమాజాన్ని మారుస్తారని
నాపాత్ర ఏ ముందనే
నిరాశని వీడి
ప్రతి ఓటరు తన వంతుగ
ఆలోచనతో ఓటేస్తే
సమర్ధులను గెలిపిస్తే
ప్రజాస్వామ్య స్వర్గం సిద్దిస్తుంది..!

                              -   తోట యోగేందర్

Saturday 13 April 2013

వేసవొస్తొందంటే హాయి... !

వేసవొస్తొందంటే హాయి... !

వేసవొస్తొందంటే హాయి
పిల్లలకు ఆనందాల వెల్లువోయి
పరీక్షలన్నీ ముగుస్తాయి
బరువులన్నీ తగ్గుతాయి
వినోదాల పంట పండునోయి
అమ్మమ్మ ఇంటికెళ్ళొచ్చోయి
బంధుమిత్రులతో ఆటలాడొచ్చోయి
విహారయాత్రలలో మునిగితేలొచ్చోయి
బాదరబంధీలసలే ఉండవోయి
సంతోషాలతో గడిచిపోతుందోయి
                             -  తోట యోగేందర్

Tuesday 2 April 2013

నింగి - నేల

నింగి - నేల

విశాలమైన నింగి
తనలో దాచుకుంటుంది అందరిని
నక్షత్రాలను కుసుమాలలా
తన సిగలో తురుముకుంటే
అవి మిణుకు మిణుకు మంటూ
ముచ్చటగొలుపుతున్నాయి
సూర్యచంద్రులను తన
ముఖాన బొట్టులా దిద్దుకుంటే
అవి వెలుగును, వేడిని ఇస్తూ
ఈ ప్రపంచానికి శక్తి ప్రదాతలుగా నిలుస్తున్నాయి
నింగిని చూసి నేల
తనదేహం పైనే
జీవకోటికి ఆవాసం కల్పించి
వ్యవసాయక్షేత్రంగా మారి
ఆహారం అందిస్తోంది...

                           - తోట యోగేందర్