ఎడతెగని యుద్దోన్మాదం.. అధోగతి దిశలో ప్రపంచం..
రణగొణ ధ్వనుల మధ్యలో... రక్తం చిందిన నేలలో
శాంతి కరువైన వేళలో... సామాన్యుడు చితికిపోయే కాలంలో!
యుద్ధం ఎవరికో లాభం... లోకానికి మాత్రం ఇది శాపం...
మమతలు మంట గలిసే... మానవత్వం మౌనంగా విలపించే..
సరిహద్దుల కాడ సెగలు... పచ్చని సంసారాల్లో కన్నీటి చుక్కలు ...
తుపాకీ గుళ్లకు ప్రాణాలు బలి... పసిపిల్లల కళ్లలో కన్నీటి తడి...
దేశాల గర్వం కోసం... వేల ఊపిరుల వినాశనం
విధ్వంసం మిగిల్చే యుద్దం... స్మశానాలుగా మార్చేది యుద్ధం...
గెలిచింది ఎవరని అడిగితే... ఓడింది మానవతే అని చెప్పక తప్పదే!
యుద్దాల పర్యవసానం.. ప్రపంచ దేశాల ఆర్థిక పతనం...
గ్యాస్ సిలిండరు గుండె మీద బరువు... కట్టెల పొయ్యికి పోయేనా పరువు?
డీజిల్ ధరలు ఆకాశాన ఉండగా... సామాన్యుడి బండి కదిలేనా ముందుగా?
పెట్రోల్ పోయాలంటే గుండె దడ... దొరుకుతుందో లేదో అని ఆత్రుత..
సంపాదించేది సరిపోక... తిండి కరువై తల్లడిల్లక తప్పదా?
ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం... సామాన్య జీవితాలు కల్లోలం...
పనుల్లేక పస్తులుండే బ్రతుకులు... లెక్కల్లోకి రావు ఈ అంకెలు!
ప్రపంచం వెనక్కి పోతున్నది... పేదవాడి నడ్డి విరుస్తున్నది
అభివృద్ధి ఆగిపోతుంది... నిరుద్యోగిత పెరుగుతుంది...
యుద్ధం ఆపేది ఎన్నడో... ఆకలి తీరేది ఏనాడో?
శాంతి గీతం వినపడాలి... లోకం శాంతిమయం కావాలి!
యుద్ధం వద్దు - శాంతియుత జీవనమే ముద్దు !




No comments:
Post a Comment