Saturday 21 September 2013

ధరా ఘాతం..!

ధరా ఘాతం..!
ఉల్లి ఘాటెక్కింది
చింతపండు చిర్రెత్తిస్తుంది
కూరగాయలు 
సామాన్యుడి ఇంటికి రానంటున్నాయి
వంటనూనెల ధరలు 
దూసుకెళుతూ సలసల కాగుతున్నాయి
పెట్రోడీజిల్ ధరలు 
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి
ఈవిధంగా ధరాఘాతం 
సామాన్యుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
జీవన పోరాటం సాగేదెలా ? అనేది శేష ప్రశ్న
కనీసం నిత్యావసరాల ధరల నియంత్రణకు
ప్రభుత్వాలు ప్రాధాన్యత పెంచితే
సామాన్యుడి జీవితం సాఫీగా సాగునంతే..!
   తోట యోగేందర్ 
                                         

Saturday 17 August 2013

నిరాశలో నిరుద్యోగులు !

నిరాశలో నిరుద్యోగులు !
రాబోయేవన్నీ ఉద్యోగ ప్రకటనలేనని
మురిసారు
కొలువులు చేజిక్కించుకోవాలని కలలుగన్నారు
కానీ
నిరుద్యోగులకు నిరాశే మిగిలింది
సమస్యల సుడిగుండాలతో
పాలన గాడి తప్పింది
నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి

                                        - తోట యోగేందర్

Thursday 6 June 2013

తొలకరి పలకరింపు

తొలకరి పలకరింపు

తొలకరి పలకరించింది 
పుడమి తల్లి పులకరించింది
వేసవి వేడితో
ప్రఛండ భానుడి తాకిడితో
విలవిల లాడిన పుడమికి
జలాభిషేకం జరిగింది
గొంతెండుతున్న జీవరాశితో
మోడుబారుతున్న వృక్షజాతితో
కళావిహీనంగా మారిన పుడమి
తొలకరి పలకరింపుతో 
తన గాయాలను మరిచింది
నూతనత్వం సంతరించుకుంది
       -  తోట యోగేందర్

Saturday 25 May 2013

చీకటి వెలుగులు...!

చీకటి వెలుగులు...!



మానవ జీవితం 
ఓ సుధీర్ఘ ప్రయాణం
కొందరి ప్రయాణంలో
పూలబాటలెదురైతే 
మరి కొందరికి 
ముళ్ళ బాటలెదురౌతాయి
కొందరికి 
తలపెట్టిన పనులన్ని
సులువుగా పూర్తవుతుంటే
మరికొందరికి 
చెమటోడ్చినా , ఎంత తపన పడినా
విజయతీరం దరిచేరక 
నిరాశ, నిస్ప్రుహలకు లోనౌతుంటారు
మరి ఎందుకింత తేడా?
అందరి జన్మ మానవజన్మే కదా?
అనే ఆలోచనలో పడతారు పరాజితులు
నిరంతర శ్రమ , పట్టుదల , కార్యదీక్షతో
విజయాలు సొంతం చేసుకోవచ్చనేది
నిపుణుల మాట
మరి సామాజిక పరిస్థితులు, 
వెనుకబాటుతనం , 
ఉన్నత వర్గాలతో పోటీ పడలేక పోవడం,
కుటుంబనేపథ్యం వెనుకబాటు తనానికి 
కారణం అని పరాజితుల వాదన
ఏది ఏమైనా 
అందివచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ
ఆత్మవిశ్వాసంతో 
ముందుకెళితే విజయం బానిసౌతుందనేది అందరిమాట ...!
        -  తోట యోగేందర్

Sunday 28 April 2013

పరిగెడుతున్నారు...!

పరిగెడుతున్నారు...!

విద్యార్ధులు ర్యాంకుల వెంట పరిగెడుతున్నారు
కళాశాలలు ర్యాంకుల పంట పండిస్తున్నారు
తల్లిదండ్రులు ర్యాంకుల కోసం
పిల్లల వెంట పడుతున్నారు
ర్యాంకులు రానిదే భవిష్యత్ లేదన్నట్లు
తమ పిల్లలు బ్రతకలేరన్నట్లు
తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు
పిల్లలు పుట్టిననాటి నుండే
ఏ కాన్వెంట్ లో చదివించాలి,
ఏ కోర్సులో చేర్పించాలి
ఏ కళాశాలను ఎంచుకోవాలి
అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు
పిల్లలు భవిష్యత్ పై ఆందోళన పడుతున్నారు
ఇక మూడేళ్ళ నుండే విలువలు నేర్పని
విద్యాసంస్ధలలో చేర్పించి
పోటీ ప్రపంచంలో విజయం పొందాలని
కళ్ళుతెరిచినప్పటి నుండి చీకటి పడేవరకు
చదివించి , వాళ్ళను యాంత్రికంగ మార్చి
చివరికి యంత్రాలుగా మారుస్తున్నారు
ఇక క్షణం తీరిక లేక డబ్బు సంపాదన యావలో
పడిన వాళ్ళని చూసి మానవత్వం లేదని ,
ఇతరులను గౌరవించే తత్వంలేదని ,
నైతిక విలువలు లేవని బాధపడుతున్నారు
ఇది విలువలు నేర్పని విద్యావ్యవస్థ లోపమో ,
ఆశల పల్లకిలో పరిగెడుతున్న తల్లిదండ్రుల లోపమో
కాలమే నిర్ణయించాలి....!

                                                         -  తోట యోగేందర్

Tuesday 16 April 2013

మార్పురావాలి .. !

మార్పురావాలి .. !

హోదా, ధనం చూసి
పలుకుబడి ఉన్న వారి వెంట పరిగెత్తే
ఓటరులో మార్పురావాలి
ఆకర్షణ మంత్రాలకు
అలవికాని వాగ్ధానాలకు
మోసపోని ఓటరుగా మారాలి
నిజాయితీతో పనిచేసే
అవినీతిని అసహ్యించుకునే
బందుమిత్ర ప్రీతి చూపక
వ్యక్తులందరిని సమంగ చూసే
నేతలవైపు చూడాలి
ఎవరో సమాజాన్ని మారుస్తారని
నాపాత్ర ఏ ముందనే
నిరాశని వీడి
ప్రతి ఓటరు తన వంతుగ
ఆలోచనతో ఓటేస్తే
సమర్ధులను గెలిపిస్తే
ప్రజాస్వామ్య స్వర్గం సిద్దిస్తుంది..!

                              -   తోట యోగేందర్

Saturday 13 April 2013

వేసవొస్తొందంటే హాయి... !

వేసవొస్తొందంటే హాయి... !

వేసవొస్తొందంటే హాయి
పిల్లలకు ఆనందాల వెల్లువోయి
పరీక్షలన్నీ ముగుస్తాయి
బరువులన్నీ తగ్గుతాయి
వినోదాల పంట పండునోయి
అమ్మమ్మ ఇంటికెళ్ళొచ్చోయి
బంధుమిత్రులతో ఆటలాడొచ్చోయి
విహారయాత్రలలో మునిగితేలొచ్చోయి
బాదరబంధీలసలే ఉండవోయి
సంతోషాలతో గడిచిపోతుందోయి
                             -  తోట యోగేందర్

Tuesday 2 April 2013

నింగి - నేల

నింగి - నేల

విశాలమైన నింగి
తనలో దాచుకుంటుంది అందరిని
నక్షత్రాలను కుసుమాలలా
తన సిగలో తురుముకుంటే
అవి మిణుకు మిణుకు మంటూ
ముచ్చటగొలుపుతున్నాయి
సూర్యచంద్రులను తన
ముఖాన బొట్టులా దిద్దుకుంటే
అవి వెలుగును, వేడిని ఇస్తూ
ఈ ప్రపంచానికి శక్తి ప్రదాతలుగా నిలుస్తున్నాయి
నింగిని చూసి నేల
తనదేహం పైనే
జీవకోటికి ఆవాసం కల్పించి
వ్యవసాయక్షేత్రంగా మారి
ఆహారం అందిస్తోంది...

                           - తోట యోగేందర్

Tuesday 26 March 2013

మహిళకు రక్షణ కరువు..!

మహిళకు రక్షణ కరువు..!

మానవత్వం మంటకలుస్తోంది
మహిళకు రక్షణ కరువౌతోంది
అర్ధరాత్రి మహిళలు
స్వతంత్రంగా తిరగడం దేవుడెరుగు
పట్టపగలే తిరగడానికి
భయపడాల్సిన పరిస్థితులు నేడు..!
ఇక్కడా అక్కడా అనే తేడా ఎరుగక
ప్రతి చోట మహిళల పై దాడులే
ఎన్నిచెట్టాలొచ్చినా
సమాజంలో మార్పురానిదే
మహిళకు భద్రత ఎండమావేనేమో..!

                                      - తోట యోగేందర్

Thursday 21 March 2013

పరీక్షా కాలం..

పరీక్షా కాలం...

ఏడాది చదువులో
ఎన్నెన్నో అంశాలు
పరిచయమౌతాయి
కొత్తకొత్త విషయాలు
అప్పుడప్పుడే తెలుస్తాయి
అర్దమయినోళ్లకు
ఆనందం వెంటుంటే
అర్ధంకాని వాళ్లకు
ఆందోళనలు ముసురుతాయి
పరీక్షలు ముంచుకొచ్చి
పరుగులు పెట్టిస్తాయి
ముచ్చెమటలు పట్టిస్తాయి
ఏడాది చదివిన చదువు
మూడుగంటల్లో
బహిర్గతం కావాలి
పేపర్ పై పెట్టాలి
ఏదోవిధంగా గట్టెక్కాలి
కనీసం కాపీ కొట్టైనా పాసవ్వాలి
తలెత్తుకు తిరగాలి
చివరికి బ్రతుకు తెరువు
వేటకెళ్లి
ముప్ప తిప్పలు పడాలి
                           -  తోట యోగేందర్

                               

Thursday 14 March 2013

తీరని ధనదాహం... !

తీరని ధనదాహం... !

కోట్లకు కోట్లు సంపాదించాలని
వేలకోట్లకు పడగెత్తాలని
అక్రమదారులలో పరిగెడుతూ
అక్రమార్జనకు పాల్పడుతూ
నీతిలేని , ధనదాహం తీరని
మానవత్వం లేని మనుషులుగా
మారుతున్నారు కొందరు మానవులు
జానడంత పొట్ట కోసం..
ఎందుకీ అవినీతి ?
నిరుపేదల వంక చూసి
మారాలి ఈ పరిస్థితి

                            - తోట యోగేందర్

Wednesday 13 March 2013

మనసు చేస్తోంది మాయ

మనసు చేస్తోంది మాయ

అందాలను ఆస్వాదించాలని
కొత్తదనం వెంట పరుగులు తీయాలని
అందరిలో గొప్పగ ఉండాలని
మారాం చేస్తది మనసు
కోర్కెల జలపాతంలో ముంచి
ఊపిరాడనివ్వనంటది
తీరని వాంఛల చిట్టాతో
నిదురపట్టనివ్వనంటది మనసు
ఎంత పొందినా ఇంకా ఏదో
కావాలంటది మనసు
వాయువేగంతో క్షణకాలంలో
పట్ట పగ్గాలు లేకుండా
పరుగుపెడుతుంది మనసు
ఆమనసు నియంత్రించగలిగినవాడే
అవుతాడు ఆదర్శప్రాయుడు... !

                                       -  తోట యోగేందర్

Thursday 7 March 2013

సుపరిపాలనకే ఓటు !

సుపరిపాలనకే ఓటు !

అంధకారం లేని ఊళ్ళతో
నిరంతర వెలుగులు నిండాలి
నిత్యావసరాల ధరలకు కళ్ళెం
వేయాలి
పనిచేయాలనుకునే వారందరికీ
ఉపాధి అందుబాటులో ఉంచాలి
చదువుకున్న వారందరికీ
ఉద్యోగ అవకాశాలు విరివిగా
కల్పించాలి
వృద్దాప్యానికి , వికలాంగులకు
వితంతువులకు సహకారం
కావాలి
పరిశ్రమలకు, వ్యవసాయానికి
ఊతమందించాలి
అలా సుపరిపాలన
అందిచేవారికోసం
ఓటరు చూస్తున్నాడు.. !

                                       - తోట యోగేందర్

Wednesday 6 March 2013

చీకటిలో చిరు దీపం

చీకటిలో చిరు దీపం 


చీకటిలో చిరు దీపం విలువైనది
కష్టాల కడలిలో మునిగి ఉన్న
అభాగ్యులకు చేయూత నిచ్చుటలో
మానవత్వమున్నది
వేలకొద్ది కానుకలు
హుండీలో సమర్పిస్తూ...
నిరుపేదకు ఇసుమంత
దానమే చేయకుంటే
ఫలమేమున్నది
మానవ సేవే మాధవ సేవ అనే
నానుడి విలువైనది ...
పాటించాల్సినది...!

                               - తోట యోగేందర్

Tuesday 5 March 2013

నవసమాజ నిర్మాణానికి

నవసమాజ నిర్మాణానికి

యాంత్రికంగ మారిన
మనుషుల మనసులలో
మానవత్వపు విలువల
మొలకలు మొలిపించుటకు
పాఠశాలస్థాయి నుండే
బీజాలను వేయాలి
విలువలు నేర్పించుటకు
మహనీయుల చరిత్రలను
పాఠాలుగ బోధించాలి
మొకైవంగనిదే
మ్రానై వంగదనే
నానుడిని పాటిస్తూ
చిన్ననాటినుండే
విలువలు పెంచాలె
నవసమాజ నిర్మాణానికి
పునాదులు వేయాలి

                         తోట యోగేందర్

Friday 1 March 2013

కోతల కాలం...!

కోతల కాలం...!

ఒకప్పుడు కూడు, గూడు , గుడ్డ
ఉంటేచాలు
నేడు ఫ్యాన్లు , టీవీలు, సెల్లు వంటివి
లేకుంటే నిదరపట్టదు
మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో
నేడు కరెంటు అంత అవసరం
అంతగా మారింది లోకం
వేసవి వస్తే కరెంటుకోతలు
ప్రజానికానికి తప్పవుతిప్పలు
పరిశ్రమలు నడవమని మొండికేస్తే
వేసవితాపానికి ఫ్యానో కూలరో లేనిది
కునుకు రాక జీవుడు దిగాలు పడతాడు
కరెంటు లేనిదే
బోరు నీరివ్వనంటుంది
ఫ్యాను తిరగనని మారాంచేస్తుంది
టీవీ మోగనంటోంది
మిక్సీ నడవనంటుంది
ఇలా కరెంటు లేకుంటే
ఇక మానవ బ్రతుకు దుర్లభమౌతుంది

                                -   తోట యోగేందర్

Wednesday 27 February 2013

అద్భుతం.... ఊహాతీతం.... !

అద్భుతం.... ఊహాతీతం.... !



అనంత విశ్వం ఓ అద్భుతం
ఎన్నెన్నో గ్రహాలు
లెక్కకు మించిన నక్షత్రాలు
వినీలకాంతులతో
విచిత్రవర్ణాలతో
అంతంలేని ఖగోళఅద్భుతాలు
అంతుపట్టని పరిణామాలు
అద్భుతం.... ఊహాతీతం.... !
క్షణానికో ఆలోచనతో
పరిసరానికో స్పందనతో
మనసు చేసే మాయ
అద్భుతం.... ఊహాతీతం.... !

                                                            -   తోట యోగేందర్

Friday 22 February 2013

ఉగ్రవాద రక్కసి...!

ఉగ్రవాద రక్కసి

ఉగ్రవాద రక్కసి
జడలు విప్పి
సవాలు విసురుతోంది
చడీ చప్పుడు లేకుండా
ఉప్పెనలా ముంచుకొచ్చి
అమాయకుల ప్రాణాలను
గాలిలోన కలిపేస్తున్నది
నాగరికపు సమాజంలో
అనాగరికపు చర్యలతో
అభివృద్దిని అడ్డుకుంటు
విధ్వంసం సృష్టిస్తున్నది
మానవరక్తం మరిగిన మృగం వలె
మానవజాతి మనుగడనే
ప్రశ్నిస్తున్నది..!
                              - తోట యోగేందర్

Thursday 21 February 2013

డబ్బుపైనే ఆశ

డబ్బుపైనే ఆశ ...!

డబ్బుపైనే నేడందరి ఆశ
 డబ్బుంటేనే సమాజంలో
ఒక వెలుగు వెలగగలమనే కాంక్ష
నిజాయితి , మానవత్వం
ఒకప్పటి మాట
ధనానేష్వణే ఇప్పుడందరి బాట
మానవసంబంధాలన్ని
ఆర్ధిక బందాలుగా మారి
ధనం మూలం ఇధం జగత్
అనే నానుడిని నిజం చేస్తున్నాయి

                                                             -  తోట యోగేందర్
                                                              

Tuesday 19 February 2013

ధరా ఘాతం..!

ధరా ఘాతం..!

ఒకప్పుడు వందుంటే పండగ
ఇప్పుడు వేలున్నా జరగదు పండగ
చక్కర ధర చుక్కలనంటితే
కారం ధర నషాలానికెక్కుతుంది
నూనెల ధర సలసల కాగుతుంటే
బియ్యంధర బిరబిర పరుగులెడుతోంది
ఆ పప్పు, ఈ పప్పు అనే తేడా లేక
అన్ని పప్పుల ధరలు రెక్కలొచ్చి
కిందికి దిగనంటున్నాయి
ఇంటికి రానంటున్నాయి
పెరిగే ధరలతో పోటీపడలేక సామాన్యులు
నిరాశతో బతుకుతున్నరు

                                              -  తోట యోగేందర్

Saturday 16 February 2013

మబ్బులు వర్షిస్తే...!

మబ్బులు వర్షిస్తే

                                         మబ్బులు వర్షిస్తే
పుడమి పులకరిస్తుంది
పూలు వికసిస్తే
తుమ్మెద నర్తిస్తుంది
సుస్వరాలు వినిపిస్తే
తనువు నాట్యమాడుతుంది
ఆస్వాదించే మనసుంటే
ప్రకృతిలో అద్బుతాలెన్నో
కనువిందు చేస్తాయి
సంతృప్తినిస్తాయి

                                               -  తోట యోగేందర్

Friday 15 February 2013

ప్రకృతి నేర్పుతోంది...!

ప్రకృతి నేర్పుతోంది...!




ఎగిసి పడే అలలు చూసి నేర్వాలి

నిరాశతో నిదురపోకూడదని
చిగురులేయు చెట్లు చూసి నేర్వాలి
అవకాశాలెన్నో ఉంటాయని
ఉదయించే సూర్యుణ్ని చూసి నేర్వాలి
చీకటి తర్వాత వెలుగు ఖాయమని
మబ్బులు దాటిన జాబిలిని చూసి నేర్వాలి
కష్టసుఖాలు తాత్కాలికమేనని
                              -  తోట యోగేందర్

Wednesday 13 February 2013

పట్టణాలు మురికి కూపాలు...!

పట్టణాలు మురికి కూపాలు...!

జనాభా పెరుగుతోంది
ఇరుకైన ఇళ్ళలో
గంపడంత జనంతో
కిక్కిరిసిన వీధులలో
పెరిగిన  వ్యర్దాలతో
జీవించక తప్పట్లేదు
మంచి గాలి దొరకదు
మంచినీరు దొరకదు
దోమలతో కుస్తీలు
అందుకే సుస్తీలు
రోడ్డుమీదకెళితెనేమో
దుమ్ముధూళి పొగతోటి
ఊపిరాడక పోయేను
ప్రశాంత వాతావరణం దొరుకుట
ఈ జన్మకు కలేనేమో

                           -  తోట యోగేందర్

Sunday 10 February 2013

తృప్తి

తృప్తి

కొందరికి కడుపు నిండా తింటే తృప్తి
మరికొందరికి అందరితో మాట్లాడితే తృప్తి
ఇంకా కొందరికి సంగీతం వినడం, బొమ్మలు గీయడం,
కొత్త విషయాలపై విశ్లేషణలు చేయడం తృప్తి
కొందరికి క్రీడలతో కల్గుతుంది తృప్తి
ఇలా ఎవరి వ్యాపకంతో వారికి కల్గుతుంది తృప్తి
ఏదో ఒక వ్యాపకం లేకుంటే మిగిలేది అంతా అసంతృప్తే......!

                                                    -  తోట యోగేందర్

Thursday 7 February 2013

అదొక కాళరాత్రి

కాళరాత్రి

అదొక కాళరాత్రి
చుట్టూ చిమ్మటి చీకటి
నక్కలు ఊలలేస్తున్నాయి
కప్పలు బెకబెకమంటున్నాయి
కుక్కల భయంకరమైన అరుపులు
గబ్బిళాల కీచు శబ్ధాలు
అంతలో అటు ప్రక్కగా
ఎరుపురంగు చీరలో
వేలాడుతున్న కేశాలతో
ఎవరో ఉన్నట్లు తోచింది
ఒక్కసారిగా పెద్ద శబ్ధం
పెద్ద అఘాదంలోకి నెట్టివేయబట్లనిపించింది
ఉలికిపడి లేచేసరికి
అదొక పీడకలే అని తెలిసింది
                              -  తోట యోగేందర్

Wednesday 6 February 2013

అందమైన గులాభి

అందమైన గులాభి


అందమైన రంగులతో
మగువల మనసుదోచేది గులాభి
సంతోషం పంచుకొనుటలో
చేతులు మారేది గులాభి
పూలల్లో రాజులాగా
వెలుగుతుంది గులాభి
ప్రేమికుల భావాలు
ఆవిష్కరించేది గులాభి
భువికేతెంచిన
అందమైన గులాబీలు
అందరిని ఆహ్లాదపరిచేవీ గులాబీలు
                                    - తోట యోగేందర్

Tuesday 5 February 2013

నిరాశలో నిరుద్యోగి

నిరాశలో నిరుద్యోగి

పెద్దపెద్ద చదువులు చదివి
కోచింగుల సెంటర్ ల చుట్టూ ప్రదక్షణలు చేసి
తీరా ఉద్యోగ అన్వేషణలో పడితే
పదుల సంఖ్యలో ఉద్యోగఖాళీలు
లక్షల సంఖ్యలో నిరుద్యోగులు
పుస్తకాలతో కుస్తీలు పట్టి
ఎంపికపరీక్షలకు హాజరైతే
ఎంపికైన కొందరు అదృష్టవంతులు
మిగిలినవారు నిరుద్యోగులుగా మిగులుతున్నారు
ఇక చేసేది లేక
ఉద్యోగ ప్రకటనల కొరకు వేచిచూడ లేక
నిరాశలో మునిగిపోతున్నారు నిరుద్యోగులు
తగిన ఉపాధి అవకాశాల కల్పనతో
ప్రభుత్వం వెన్నుదన్నుగ నిలవాలి
యువతరానికి ఆత్మవిశ్వాసం కల్పించాలి
డిమాండ్ ఉన్న రంగాలలో శిక్షణ
ఇప్పించాలి
నిరుద్యోగ నిర్మూలనకు నడుంబిగించాలి
                                            - తోట యోగేందర్
 

Monday 4 February 2013

గ్రామీణుల వేదన...!

గ్రామీణుల వేదన...!

డబ్బులుంటేనే తీరుతుంది దాహం
లేదంటే తాగాలి కలుషిత జలం
కారుచీకట్లతో స్నేహం చేసేను వీధులు
కనపడవు విద్యుత్ వెలుగులు
గుంతలతో నిండిన రహదారులు
నరకం చూపే ప్రయాణాలు
అదునుకు దొరకవు రవాణా సాధనాలు
అర్ధరాత్రో అపరాత్రో రోగమొస్తే
దిక్కులేని పల్లెలు
సౌకర్యాల వేటలో
పట్నవాసం పడుతున్నారు ఉన్నోళ్లు...!
కష్టాలకు అలవాటు పడుతున్నారు లేనోళ్లు...!
                                          - తోట యోగేందర్

Monday 28 January 2013

అంతుపట్టని రాజకీయాలు... !

అంతుపట్టని రాజకీయాలు... !

గొంతు చించుకుంటున్నారు
తెలంగాణ వాదులు
సందుచూసి అస్త్రాలు
సంధిస్తున్నారు అన్యులు
పరిష్కారం చూపలేకున్నారు
ఢిల్లీ ప్రభువులు
అసహనంతో ఊగిపోతున్నారు
విధ్యార్ధులు
ఈ సమస్యకు పరిష్కారం
చూపలేరా అని ఆశగా చూస్తున్నారు
సామాన్యులు
ఎవరి వాదన వారిది
వేదన తీరే దారేది
శాంతి దొరికేది ఏనాటికి ?
                                    -  తోట యోగేందర్

Thursday 24 January 2013

కోరికలే గుర్రాలైతే...!

కోరికలే గుర్రాలైతే...!

కోరికలే మనిషిని ముందుకు నడిపించేవి
అవి సాధ్యమయ్యేవైతే
అవి మనస్థాయికి తగినవైతే
అవే తాహతకు మించినవైతే
ఆకోరికలే గుర్రాలైతే
ఆకోరికలే అసంఖ్యాకమైతే
మనిషిని కబళిస్తాయి
శాంతిని మింగేస్తాయి
జీవితాన్ని చిందర వందర చేస్తాయి
అందుకే నేమో
ఆస్తి మూరెడు ఆశ బారెడు అనే నానుడి పుట్టింది
మనిషి అదుపులో కోరికల నుంచితే
అతని జీవితం ఆనందమయమౌతుంది
చీకూ చింత లేని జీవితం సొంత మౌతుంది
                                      -  తోట యోగేందర్

Monday 21 January 2013

ఏది సమానత్వం...

ఏది సమానత్వం...

ఒక వైపు మట్టే అంటని
బహుళ అంతస్తులలో
రాజభోగాలతో
విలాస జీవితం గడిపే
ప్రజానీకం
మరోవైపు పూరి గుడిసెలలో
చలికి వణుకుతో
వర్షంలో తడుస్తూ
తలదాచుకొనే దిక్కులేని పేద జనం
ఒకవైపు వేలకోట్ల ఆస్తులతో
మంచినీటి ప్రాయంగా
డబ్బు ఖర్చు చేసే సంపన్న వర్గం
మరో వైపు పిల్లా జల్లా అనే బేదం లేక
ఇంటిల్లిపాది కూలీ నాలీ చేస్తే కాని
కడుపు నిండని వైనం
                         -  తోట యోగేంధర్

Thursday 17 January 2013

కాలం విలువైనది

కాలం విలువైనది

తిరిగిరానిది
ఎన్నో సమస్యలకు
సమాధానం కాలం
ఎన్నో ఆశలను
రేకెత్తించేది కాలం
ఎన్నో గాయాలను
మాన్పేది కాలం
సంపదను సృష్టించేది
కాలం
ఓడలను బండ్లుగా
బండ్లను ఓడలుగా మారుస్తుంది
కాలం
వెలకట్టలేనిది
తిరిగిరానిది
కాలం
ఎందరినో ఒక వెలుగు వెలిగించేది
కాలం
అందరిని తనలో లీనం చేసుకునేది
కాలం
                                -  తోట యోగేందర్

Tuesday 15 January 2013

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్ఛింది
సంబరాలనే తెచ్చింది
కొత్త అల్లుళ్ళతో .. బంధుమిత్రులతో
రంగురంగుల ముగ్గులతో
మధురమైన వంటకాలతో
పాయసాల తియ్యదనంతో
పతంగుల కేళీతో
తెలుగు లోగిళ్ళలో
ఆనందం ఆహ్లాదం నింపుతూ
సంక్రాంతి వచ్ఛింది
సంబరాలనే తెచ్చింది
                              - తోట యోగేందర్

Wednesday 9 January 2013

పేదలు బ్రతుకు చిత్రం...

పేదలు బ్రతుకు చిత్రం...

పగిలిన రేకులు
కురిసే పెంకులు
తడితో నిద్రలేని రాత్రులు
చిన్నపాటి వర్షానికే
చెరువును తలపించే వాకిళ్లు
ఆమురికి నీటిలో
అమాయకంగా ఆటలాడే పసిపిల్లలు
దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు
పక్కా ఇళ్లుంటే బాగుండేదనే కలలు
ఆదాయం లేక ఆవిరైపోయే కలలు
సహాయం పొందాలంటే
కావాలి పైరవీలు
అవి చేయలేక చేతులెత్తేస్తారు పేదలు
                                       -  తోట యోగేందర్

Friday 4 January 2013

తరలి రావాలి నాకోసం

తరలి రావాలి నాకోసం

ఉరకలేస్తోంది ఉత్సాహం
తరలి రావాలి నాకోసం
పంచవన్నెల రామచిలుకవై
ఆకశాన ఇంధ్రధనస్సువై
నిండైన జాబిలివై
కలహంస నడకలతో
పసిడివర్ణపు కాంతులతో
తరలి రావాలి నాకోసం
నునువెచ్చని గాలివై
మురిపించే మంచువై
నను ప్రేమించే నెచ్చెలి వై
తరలి రావాలి నాకోసం
నిలిచిపోవాలి సంతోషం
                                  -  తోట యోగేందర్

Thursday 3 January 2013

చిన్నారి లోకం

చిన్నారి లోకం

తన వెంటే అమ్ముండాలని
తన చుట్టూ ఆనందం నిండాలని
గాలిలో పక్షి వోలె
వనంలో లేడివోలె
స్వేచ్చగా ఉండాలని
మట్టిలో ఆడినా
నీళ్ళలో తడిసినా
రాళ్లనే తిన్నా
అడ్డు చెప్పకూడదని
ఆశించేది చిన్నారి లోకం
బుడిబుడి నడకలతో
అటూ ఇటూ తిరగాలని
పడి లేస్తూ ఏడుస్తూ
గాయాలను మరుస్తూ
అలసట ఎరుగని ఆటలతో
నిండి ఉండు చిన్నారి లోకం
అభం శుభం తెలియకుండ
తరతమ బేధం చూపదు
చిన్నారి లోకం
                                     - తోట యోగేందర్

Wednesday 2 January 2013

నిశ్శబ్ధం

నిశ్శబ్ధం

మనసుకు శాంతిని చేకూర్చేది
నిశ్శబ్ధం
మనుషులను భయపెట్టేది
నిశ్శబ్ధం
మనుషులలో ఆలోచనలు
రేకెత్తించేది నిశ్శబ్ధం
మనసులోని నిగూఢ శక్తిని
మేల్కొలిపేది నిశ్శబ్ధం
ఆకుల సవ్వడి వినాలన్నా
మనసుల కలయిక జరగాలన్నా
తనువులు ఏకం కావాలన్నా
కమ్మని కలలే కలగాలన్నా
కలతలేని నిద్రను పొందాలన్నా
కావల్సింది నిశ్శబ్ధం
                                   - తోట యోగేందర్
 

కొత్త సంవత్సరానికి స్వాగతం

కొత్త సంవత్సరానికి స్వాగతం

ఆశల రెక్కలతో
ప్రకృతి కరుణతో
పాడిపంటలతో
ఆయురారోగ్యాలతో
శాంతి సౌక్యాలతో
మానవత్వపు పరిమళాలతో
దాతృత్వపు చేతులతో
నిండిపోవాలి ఈ వత్సరం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
                                                            -  తోట యోగేందర్