Thursday, April 30, 2026

వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చేయి...!

 వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చేయి...



బద్దకం తో మునిగి నీ అమూల్య కాలాన్ని బలి చేయకు

ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల గాలినే ప్రాణవాయువుగా పీల్చు

వ్యాధుల కోటను నీ నడకతో ముక్కలు ముక్కలు చేయి

దాహం తీర్చుకోవడమే కాదు, దేహాన్ని ప్రక్షాళన చేయి

గుక్కెడు నీరు నీలో ఉత్తేజాన్ని ఇచ్చును చూడు

రసాయనాల విషపు జంక్ ఫుడ్‌ను తరిమికొట్టు

తృణధాన్యాల బలంతో నీ ఎముకలకు వజ్రకవచం తొడుగు



 నూనె బిందువుల వెనుక దాగున్న ముప్పును పసిగట్టు

 తీపి మిఠాయిలతో తీపి వ్యాధులకు బానిస అవ్వకు

పండ్ల రసమే నీ నరాలకు నవచైతన్యం ఇచ్చే ఇంధనం

కూరగాయల కొలువులో నీ కాయకష్టానికి దొరకును ప్రతిఫలం

అలసటను తరిమికొట్టి గాఢ నిద్రలో సేదతీరు



నిశీధిలో నీ మెదడుకు ప్రశాంతతను కానుకగా ఇవ్వు

కోపం అనే నిప్పును నవ్వు అనే నీటితో చల్లార్చు

ఒత్తిడిని జయించి నీ మనస్సును హిమగిరిలా మార్చు

శరీరం ఒక దేవాలయం, దాన్ని మలినం చేయకు

వ్యాధుల దాడికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టకు

ఆరోగ్యమే నీ అసలైన గెలుపు అని జగతికి చాటు

Saturday, April 25, 2026

ఆపకు నీ పయనం...విజయ తీరం చేరే దాకా...

 

ఆపకు నీ పయనం...విజయ తీరం చేరే దాకా...


**ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉందో...**

**అది ఆ సమయానికి జరిగే తీరుతుంది నిక్కముగా!**

గతించిన కాలం తిరిగి రాదు.. 

జరగబోయే దానిని ఆపలేవు..మార్చలేవు 

ఏ శక్తితోనూ, ఏ యూక్తితోనూ...

 

**విధి రాతలో కొట్టివేతలు ఉండవు కానీ...**

చెదరని ధైర్యం నీ ఆయుధమైతే,

మూసుకున్న తలుపుల వెనుక మరెన్నో దారులు,

నీ కోసం కొత్తగా వేచి చూస్తుంటాయి నిరంతరం!

    
  **జరిగిన చేదు జ్ఞాపకం ఒక పాఠం అనుకో,**

**జరగబోయే తీపి కల ఒక అవకాశం అనుకో!**

నీ చేతిలో ఉన్న ఈ క్షణమే దేవుడిచ్చిన గొప్ప వరం,

దీనిని వదులుకోకు.. అశ్రద్ధతో పోగొట్టుకోకు....

**నీ మనసు ప్రశాంతంగా ఉంటే.. కాలమే నీకు తోడవుతుంది,**

నిరంతరం శ్రమించే వాడికి కాలమే విజయాన్ని అందిస్తుంది....


ఓర్పును వీడకు.. నమ్మకాన్ని వదులుకోకు...

నీ అడుగులు ధైర్యంగా పడితే..

 కాలం నీకు అనుకూలంగా మారుతుంది...

**నిన్నటి కన్నీరు నేటి నీ ఎదుగుదలకు సోపానం,**

**నేటి నీ కష్టం రేపటి నీ గెలుపుకు మూలధనం!**


చింతలు మాని.. చిరునవ్వుతో సవాలుని స్వీకరించు,

నీలోని సంకల్పమే విధిని సైతం తలవంచేలా చేస్తుంది.

**కాలం ఎవరి కోసం ఆగదు.. నిన్ను నీవు నిరూపించుకో,**

**లోకం ఏమన్నా లెక్క చేయకు.. నీ లక్ష్యం వైపు సాగిపో!**

నమ్మకం నీ గుండెల్లో.. నిశ్చలత నీ చూపుల్లో ఉంటే,

విజయం నీ పాదాల చెంత దాసోహమంటుంది నిశ్చయముగా.... 

సాగిపో ముందుకు సాగిపో..

ఆపకు నీ పయనం...విజయ తీరం చేరే దాకా...

Monday, April 13, 2026

మండిపోయే సూరీడు పైన ఉన్నా... నీ దరి చేరదు అలసట చూడు..

 మండిపోయే సూరీడు పైన ఉన్నా... నీ దరి చేరదు అలసట చూడు...


 కుండ లోని నీరు - ప్రాణానికి ఆధారం
దప్పిక తీర్చే అమృతం...

గంట గంటకూ గుక్కెడు తాగు... శరీరానికి చలవను కానుకగా ఇవ్వు...

పండ్ల రసాల విందు పుచ్చకాయ ముక్కలు... నోరూరించే చక్కెరలు!

మజ్జిగ గ్లాసులో కొంచెం అల్లం, కొత్తిమీర... ఎండ వేడిని తరిమికొట్టే అసలైన అస్త్రం..



కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే... ఎండ కూడా నీ ముందు తలవంచుతుందిలే చూడు....

తేలికపాటి వస్త్రధారణ మేలు.. బిగువైన బట్టలు పక్కన బెట్టు...

తెల్లని వస్త్రాలు ఒంటికి చుట్టు! చెమట తిప్పలు తప్పిస్తాయి అది నీకు మేలు...

గాలిని ఒంటికి తాకనిస్తాయి.. మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి చూడు...



నెత్తి మీదకు సూర్యుడు రాకముందే  పొద్దున్నే పనులు ముగించు...

 మధ్యాహ్నం వేళ ఇంటి పట్టునే ఉండు... చల్లని నీడలో సేదతీరి చూడు....


గొడుగును తోడుగా తీసుకో... ఎండను  నీడలా మార్చుకో....

వేసవి సెగ తగలనీయకు ... వడదెబ్బకు గురికాకు...

 

Monday, April 6, 2026

ఎడతెగని యుద్దోన్మాదం.. అధోగతి దిశలో ప్రపంచం..

 

ఎడతెగని యుద్దోన్మాదం.. అధోగతి దిశలో ప్రపంచం..

 


 

రణగొణ ధ్వనుల మధ్యలో... రక్తం చిందిన నేలలో

శాంతి కరువైన వేళలో... సామాన్యుడు చితికిపోయే కాలంలో!

యుద్ధం ఎవరికో లాభం... లోకానికి మాత్రం ఇది శాపం...

మమతలు మంట గలిసే... మానవత్వం మౌనంగా విలపించే..

సరిహద్దుల కాడ సెగలు... పచ్చని సంసారాల్లో కన్నీటి చుక్కలు ...

తుపాకీ గుళ్లకు ప్రాణాలు బలి... పసిపిల్లల కళ్లలో కన్నీటి తడి...



దేశాల గర్వం కోసం... వేల ఊపిరుల వినాశనం

విధ్వంసం మిగిల్చే యుద్దం... స్మశానాలుగా మార్చేది యుద్ధం...

గెలిచింది ఎవరని అడిగితే... ఓడింది మానవతే అని చెప్పక తప్పదే!



యుద్దాల పర్యవసానం.. ప్రపంచ దేశాల ఆర్థిక పతనం...

గ్యాస్ సిలిండరు గుండె మీద బరువు... కట్టెల పొయ్యికి పోయేనా పరువు?

డీజిల్ ధరలు ఆకాశాన ఉండగా... సామాన్యుడి బండి కదిలేనా ముందుగా?



పెట్రోల్ పోయాలంటే గుండె దడ... దొరుకుతుందో లేదో అని ఆత్రుత..

సంపాదించేది సరిపోక... తిండి కరువై తల్లడిల్లక తప్పదా?

ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం... సామాన్య జీవితాలు కల్లోలం...

పనుల్లేక పస్తులుండే బ్రతుకులు... లెక్కల్లోకి రావు ఈ అంకెలు!

ప్రపంచం వెనక్కి పోతున్నది... పేదవాడి నడ్డి విరుస్తున్నది

అభివృద్ధి ఆగిపోతుంది... నిరుద్యోగిత పెరుగుతుంది...

యుద్ధం ఆపేది ఎన్నడో... ఆకలి తీరేది ఏనాడో?

శాంతి గీతం వినపడాలి... లోకం శాంతిమయం కావాలి!

యుద్ధం వద్దు - శాంతియుత జీవనమే ముద్దు !


Friday, April 3, 2026

మేలుకో నేస్తం.. సాగాలి నీ ప్రయాణం.....

 మేలుకో నేస్తం.. సాగాలి నీ ప్రయాణం.....


మేలుకో నేస్తం.. సాగాలి నీ ప్రయాణం

చీకటిని చీల్చుకుంటూ.. ఉదయించాలి నీ కిరణం

అలసటను దరిచేరనీకు.. ఆశయమే నీ ఆయుధం

అడుగు ముందుకు వేయవయ్యా.. గమ్యమే నీ లక్ష్యం!


రాళ్ళ దారి ఎదురైనా.. పాదాలే తడబడనీకు

ఓటమి నిన్ను పలకరించినా.. గుండె ధైర్యం వీడకు

మట్టిలో ఉన్న విత్తనమే.. రేపటి మహావృక్షం

మౌనంగా ఉన్న నీ శ్రమయే.. రేపటి నీ విజయం!

కాలం నీకోసం ఆగుతుందా? వెనుకడుగు వేయకు

కష్టం నిన్ను శోధించినా.. కన్నీటితో కరగకు

శిఖరాన్ని తాకే చిరునవ్వే.. నీ కీర్తికి సాక్ష్యం

సంకల్పమే నీ బలమైతే.. సృష్టి అంతా నీ వశం!


వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చేయి...!

  వేకువనే మేలుకొని సూర్యునితో కరచాలనం చే యి... బద్దకం తో మునిగి నీ అమూల్య కాలాన్ని బలి చేయకు ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల గాలినే ప్రాణవాయ...